(॥పల్లవి॥)
అంగన భావము చూడవయ్య నీవు
యింగితాన నిన్నుఁ జూచి యిట్టె పులకించె
(॥అంగ॥)
సిగ్గుననూరకె వుండె చెలి యంతలో నీవు
దగ్గరఁగా నవ్వు నవ్వె తనలోనే
వెగ్గళించి యట్టె నీవు వెసఁ గాఁగిలించుకోఁగా
నిగ్గులఁ గరఁగుకొంటా నిట్టూరుపు నించెను
(॥అంగ॥)
కన్నులు తొలుత మూసె కామినినట్టె నీవు
చన్నులు విసుకఁగాను చలి వాసెను
మన్నించి యిప్పటి నీవు మంచముపైకిఁ దియ్యఁగా
చిన్ని చెమటలఁ బొంగి చిత్తము మరచెను
(॥అంగ॥)
చింతతోడనుండి వుండి చేరి నిన్నుఁ గూడఁగాను
కాంతనెమ్మోమున కళ దేరెను
యింతలో శ్రీవేంకటేశ యింకా నీవు రమ్మనఁగా
సంతసాన విఱ్ఱవీఁగి చనవు మెరసెను
(||pallavi||)
aṁgana bhāvamu sūḍavayya nīvu
yiṁgidāna ninnum̐ jūsi yiṭṭĕ pulagiṁchĕ
(||aṁga||)
siggunanūragĕ vuṁḍĕ sĕli yaṁtalo nīvu
daggaram̐gā navvu navvĕ tanalone
vĕggaḽiṁchi yaṭṭĕ nīvu vĕsam̐ gām̐giliṁchugom̐gā
niggulam̐ garam̐gugŏṁṭā niṭṭūrubu niṁchĕnu
(||aṁga||)
kannulu tŏluda mūsĕ kāmininaṭṭĕ nīvu
sannulu visugam̐gānu sali vāsĕnu
manniṁchi yippaḍi nīvu maṁchamubaigim̐ diyyam̐gā
sinni sĕmaḍalam̐ bŏṁgi sittamu marasĕnu
(||aṁga||)
siṁtadoḍanuṁḍi vuṁḍi seri ninnum̐ gūḍam̐gānu
kāṁtanĕmmomuna kaḽa derĕnu
yiṁtalo śhrīveṁkaḍeśha yiṁkā nīvu rammanam̐gā
saṁtasāna viṭravīm̐gi sanavu mĕrasĕnu