అంగడి కెక్కె వలపు లారడిఁ బడె వయసు
(॥పల్లవి॥)
అంగడి కెక్కె వలపు లారడిఁ బడె వయసు-
లెంగిలిమోవు లివిగో యిఁక నేల సిగ్గులు
(॥అంగ॥)
వూరకే నామతిలోన నొకటొకటే తలఁచి
కూరిమి నీకు మరులుగొంటి నేను
చేరి నీ వంతలో నాపైఁ జేతులు చాఁచి చాఁచి
మేరలు మీరఁగఁ బోయి మేను మఱచితివి
(॥అంగ॥)
నీయింటికి నెడతాఁకి నిచ్చ నిచ్చ పొందు సేసి
మాయల నీతో మాటలే మరిగితిని
బాయట నవ్వులు నవ్వి పచ్చి యేకతాలు చెప్పి
నీయంతనే కిందువడి నెట్టన లోనైతివి
(॥అంగ॥)
చుట్టమనై వచ్చినీతో జూజములే యాడి ఆడి
గట్టిగా నిన్ను కాఁగిటఁ గలసితిని
యిట్టె శ్రీ వేంకటేశ యెదుట నా మోము చూచి
జట్టిం గరిఁగి కరఁగి చవులెల్లాఁ గంటివి
(||pallavi||)
aṁgaḍi kĕkkĕ valabu lāraḍim̐ baḍĕ vayasu-
lĕṁgilimovu livigo yim̐ka nela siggulu
(||aṁga||)
vūrage nāmadilona nŏgaḍŏgaḍe talam̐si
kūrimi nīgu marulugŏṁṭi nenu
seri nī vaṁtalo nābaim̐ jedulu sām̐si sām̐si
meralu mīram̐gam̐ boyi menu maṟasidivi
(||aṁga||)
nīyiṁṭigi nĕḍadām̐ki nichcha nichcha pŏṁdu sesi
māyala nīdo māḍale marigidini
bāyaḍa navvulu navvi pachchi yegadālu sĕppi
nīyaṁtane kiṁduvaḍi nĕṭṭana lonaidivi
(||aṁga||)
suṭṭamanai vachchinīdo jūjamule yāḍi āḍi
gaṭṭigā ninnu kām̐giḍam̐ galasidini
yiṭṭĕ śhrī veṁkaḍeśha yĕduḍa nā momu sūsi
jaṭṭiṁ garim̐gi karam̐gi savulĕllām̐ gaṁṭivi