అటువంటి సతికిఁ గాక నీవు లోనయ్యేవా
(॥పల్లవి॥)
అటువంటి సతికిఁ గాక నీవు లోనయ్యేవా
ఘటన నే నీకు నిచ్చకము లాడేదానను
(॥అటు॥)
చెంతల నందరిలోన సిగ్గుపడి మండితేను
కాంతునిఁ జెనకవచ్చు గబ్బియైనది
యెంత వోరుచుకుండినా నెరఁగదు మోహించి
పంతములాడఁ జూచు భయము మాలినది
(॥అటు॥)
తక్కక యంతేసిదొరతనాన విభుఁడుండినా
మిక్కిలి నవ్వు మందెమేళమైనది
వొక్కటై పాన్పున నెట్టు వొనగూడి వుండినాను
కక్కసించు రతులకు గయ్యాళియైనది
(॥అటు॥)
గారవించి మగవాఁడు కాతరానఁ బెనఁగితే
మారుకొనుఁ గడుఁ జలమరియైనది
చేరి యలమేల్‌మంగను శ్రీవెంకటేశ కూడితి-
వీరీతిఁ బ్రియము చెప్పు నిచ్చకమైనది
(||pallavi||)
aḍuvaṁṭi sadigim̐ gāga nīvu lonayyevā
ghaḍana ne nīgu nichchagamu lāḍedānanu
(||aḍu||)
sĕṁtala naṁdarilona siggubaḍi maṁḍidenu
kāṁtunim̐ jĕnagavachchu gabbiyainadi
yĕṁta vorusuguṁḍinā nĕram̐gadu mohiṁchi
paṁtamulāḍam̐ jūsu bhayamu mālinadi
(||aḍu||)
takkaga yaṁtesidŏradanāna vibhum̐ḍuṁḍinā
mikkili navvu maṁdĕmeḽamainadi
vŏkkaḍai pānpuna nĕṭṭu vŏnagūḍi vuṁḍinānu
kakkasiṁchu radulagu gayyāḽiyainadi
(||aḍu||)
gāraviṁchi magavām̐ḍu kādarānam̐ bĕnam̐gide
mārugŏnum̐ gaḍum̐ jalamariyainadi
seri yalamelmaṁganu śhrīvĕṁkaḍeśha kūḍidi-
vīrīdim̐ briyamu sĕppu nichchagamainadi