అటువలెనె సుజ్ఞాని యన్ని పుణ్యములుఁ జేసి
(॥పల్లవి॥)
అటువలెనె సుజ్ఞాని యన్ని పుణ్యములుఁ జేసి
తటుకున హరి కిచ్చి తా నుండవలెను
(॥అటు॥)
వూరి పసులను మేపి వొప్పగించి యిండ్లకు
చేరి జంగిలివాఁడు నిశ్చింతుఁడై వుండు
తేరకాఁడు మోసి మోచి తెచ్చి నగరి కొప్పించి
నేరుపుతో వెట్టి వాఁడు నెమ్మది నిద్రించును
(॥అటు॥)
అంటి బూరెలు వండినయాపె చేతులట చూపి
యింటివారి కొప్పగించి యేఁగినయట్టు
నంటుతోడఁ బేరటాలు నాగవల్లియైనమీఁద
వొంటిఁ దన నెలవున నూరకున్నయట్టు
(॥అటు॥)
కూటమి వచ్చినవాఁడు గుంపులెల్లా విచ్చిపోతే
యేఁటివాఁడుఁ గాక తన యిచ్చనే వుండు
పాటించి శ్రీవేంకటేశుబంటు యేలికెపనులు
గాటాన నన్నిఁ జేయుఁ గర్త యేమీ గాఁడు
(||pallavi||)
aḍuvalĕnĕ sujñāni yanni puṇyamulum̐ jesi
taḍuguna hari kichchi tā nuṁḍavalĕnu
(||aḍu||)
vūri pasulanu mebi vŏppagiṁchi yiṁḍlagu
seri jaṁgilivām̐ḍu niśhchiṁtum̐ḍai vuṁḍu
teragām̐ḍu mosi mosi tĕchchi nagari kŏppiṁchi
nerubudo vĕṭṭi vām̐ḍu nĕmmadi nidriṁchunu
(||aḍu||)
aṁṭi būrĕlu vaṁḍinayābĕ sedulaḍa sūbi
yiṁṭivāri kŏppagiṁchi yem̐ginayaṭṭu
naṁṭudoḍam̐ beraḍālu nāgavalliyainamīm̐da
vŏṁṭim̐ dana nĕlavuna nūragunnayaṭṭu
(||aḍu||)
kūḍami vachchinavām̐ḍu guṁpulĕllā vichchibode
yem̐ṭivām̐ḍum̐ gāga tana yichchane vuṁḍu
pāḍiṁchi śhrīveṁkaḍeśhubaṁṭu yeligĕbanulu
gāḍāna nannim̐ jeyum̐ garda yemī gām̐ḍu