అతఁడు లోకోన్నతుఁ డాదిమపురుషుఁడు అన్నిటాను పరిపూర్ణుఁడు
(॥పల్లవి॥)
అతఁడు లోకోన్నతుఁ డాదిమపురుషుఁడు అన్నిటాను పరిపూర్ణుఁడు
చతురుఁడితఁడే రక్షించఁగలవాఁడు శరణని బ్రదుకవో వో మనసా
(॥అతఁ॥)
మరుతండ్రిఁ జూచిన మంచికన్నులను మరొకరిఁ జూచిన నింపౌనా
సిరువరు నామమునొడిగిన నోరను చిక్కిన పేరులు యితవౌనా
పరమాత్ముఁ దలచిన మనసులోపలను పరులఁ దలఁచితే నొడంబడునా
కరుణానిధి పుణ్యకథలువినిన చెవుల కడలసుద్దులు విన సమ్మతించునా
(॥అతఁ॥)
నరహరిఁ బూజించినయట్టి కరములు నరుల సేవసేయ నరుహములా
మురహరు శరణని మొక్కిన శిరసున మూఢులకు మొక్క నుచితములా
హరిమందిరమున కరిగెడు పదములు అధములిండ్ల కేఁగఁగ నలవడునా
పురుషోత్తము లాంఛనము మోచిన మేను భువి హీనవృత్తికిఁ బొసఁగీనా
(॥అతఁ॥)
గోవిందుఁడే దిక్కై వుండు ఘనులకు కొలిపీనా దేవతాంతరంబులు
భూవల్లభుదెసఁ బుట్టిన జ్ఞానము పొంది వేరొకట నిలిచీనా
శ్రీవేంకటపతిపై నిడిన భక్తి చెలులపై నునుపఁగఁ దగవవునా
దేవకినందనుఁ డితనిదాసులఁ దెలియఁగ జడులకుఁ దరమయ్యీనా
(||pallavi||)
adam̐ḍu logonnadum̐ ḍādimaburuṣhum̐ḍu anniḍānu paribūrṇum̐ḍu
sadurum̐ḍidam̐ḍe rakṣhiṁcham̐galavām̐ḍu śharaṇani bradugavo vo manasā
(||adam̐||)
marudaṁḍrim̐ jūsina maṁchigannulanu marŏgarim̐ jūsina niṁpaunā
siruvaru nāmamunŏḍigina noranu sikkina perulu yidavaunā
paramātmum̐ dalasina manasulobalanu parulam̐ dalam̐side nŏḍaṁbaḍunā
karuṇānidhi puṇyagathaluvinina sĕvula kaḍalasuddulu vina sammadiṁchunā
(||adam̐||)
naraharim̐ būjiṁchinayaṭṭi karamulu narula sevaseya naruhamulā
muraharu śharaṇani mŏkkina śhirasuna mūḍhulagu mŏkka nusidamulā
harimaṁdiramuna karigĕḍu padamulu adhamuliṁḍla kem̐gam̐ga nalavaḍunā
puruṣhottamu lāṁchhanamu mosina menu bhuvi hīnavṛttigim̐ bŏsam̐gīnā
(||adam̐||)
goviṁdum̐ḍe dikkai vuṁḍu ghanulagu kŏlibīnā devadāṁtaraṁbulu
bhūvallabhudĕsam̐ buṭṭina jñānamu pŏṁdi verŏgaḍa nilisīnā
śhrīveṁkaḍabadibai niḍina bhakti sĕlulabai nunubam̐gam̐ dagavavunā
devaginaṁdanum̐ ḍidanidāsulam̐ dĕliyam̐ga jaḍulagum̐ daramayyīnā