ఆయము నీచేతనున్న దన్నిటికిని
(॥పల్లవి॥)
ఆయము నీచేతనున్న దన్నిటికిని
పాయము పదను వచ్చెఁ బైకొనవయ్యా
(॥ఆయ॥)
అలిగినదానివలెనంటక వున్నది గాని
నిలువెల్లాఁ దమకమే నీమీఁదను
బలిమేపాటిసేసిన పైపైనున్నది చెలి
చెలులఁ జూపక నీవే చేయి చాఁచవయ్యా
(॥ఆయ॥)
యెనయనిదానివలె నెక్కడో చూచీఁ గాని
తనువెల్లనాసలే తగులమికి
చెనకితేఁ జాలుఁగాని చేతిలోనున్నది యింతి
పెనఁగదు పిలిచితేఁ బేరుకొనవయ్యా
(॥ఆయ॥)
సిగ్గువడ్డదానివలె శిరసు వంచీఁ గాని
అగ్గలికెల్లా నీసొమ్మై ఆముకొన్నది
అగ్గమై శ్రీ వెంకటాధిప నిన్నుఁ గూడెను
యెగ్గులేదు మీలోన నిట్టే వుండవయ్యా
(||pallavi||)
āyamu nīsedanunna danniḍigini
pāyamu padanu vachchĕm̐ baigŏnavayyā
(||āya||)
aliginadānivalĕnaṁṭaga vunnadi gāni
niluvĕllām̐ damagame nīmīm̐danu
balimebāḍisesina paibainunnadi sĕli
sĕlulam̐ jūbaga nīve seyi sām̐savayyā
(||āya||)
yĕnayanidānivalĕ nĕkkaḍo sūsīm̐ gāni
tanuvĕllanāsale tagulamigi
sĕnagidem̐ jālum̐gāni sedilonunnadi yiṁti
pĕnam̐gadu pilisidem̐ berugŏnavayyā
(||āya||)
sigguvaḍḍadānivalĕ śhirasu vaṁchīm̐ gāni
aggaligĕllā nīsŏmmai āmugŏnnadi
aggamai śhrī vĕṁkaḍādhiba ninnum̐ gūḍĕnu
yĕgguledu mīlona niṭṭe vuṁḍavayyā