ఆహా యేమి చెప్పేది హరి నీ చిక్కు
(॥పల్లవి॥)
ఆహా యేమి చెప్పేది హరి నీ చిక్కు
ఊహాపోహలచేత వుడివోవు వయసు
(॥ఆ హా॥)
చేతఁ జిక్కినట్లుండు చెప్పినదాఁకా జ్ఞానము
ఆతలఁ గడచితేను అట్టటు వోవు
ఱాతఁ జేసినట్టుండు నాఱడి దేహ మాయుష్యముతో
ఆతుమ యెడసితేను అదవదలవును
(॥ఆ హా॥)
నిక్కమువలెనే వుండు నిద్రించుదాఁకాఁ గల
పక్కన మేలుకొంటేను బట్టబయలు
దక్కిన యట్లనే వుండు ధనధాన్యములు యింట
చక్క ననుభవించితే సరికి సరి యౌను
(॥ఆ హా॥)
సులభమువలె నుండు చూచేటి యీ లోకము
యిలఁ జేకొనఁ గోరితే నెల యించును
యెలమి శ్రీవేంకటేశ యిది నీ కల్పితమే
తలపోసి మెలఁగ నీదాసు లెఱుఁగుదురు
(||pallavi||)
āhā yemi sĕppedi hari nī sikku
ūhābohalaseda vuḍivovu vayasu
(||ā hā||)
sedam̐ jikkinaṭluṁḍu sĕppinadām̐kā jñānamu
ādalam̐ gaḍasidenu aṭṭaḍu vovu
ṟādam̐ jesinaṭṭuṁḍu nāṟaḍi deha māyuṣhyamudo
āduma yĕḍasidenu adavadalavunu
(||ā hā||)
nikkamuvalĕne vuṁḍu nidriṁchudām̐kām̐ gala
pakkana melugŏṁṭenu baṭṭabayalu
dakkina yaṭlane vuṁḍu dhanadhānyamulu yiṁṭa
sakka nanubhaviṁchide sarigi sari yaunu
(||ā hā||)
sulabhamuvalĕ nuṁḍu sūseḍi yī logamu
yilam̐ jegŏnam̐ goride nĕla yiṁchunu
yĕlami śhrīveṁkaḍeśha yidi nī kalbidame
talabosi mĕlam̐ga nīdāsu lĕṟum̐guduru