ఆతఁడెంత నీవెంత అవునే మేలు
(॥పల్లవి॥)
ఆతఁడెంత నీవెంత అవునే మేలు
యేతరిదానవు నీకు నెంచనున్నదా
(॥ఆత॥)
చెల్లుబడిగలితేను శింగారించుకొందుగాక
పల్లదాలాడుదురా పతితోను
గొల్లవారి తోడిపని గొడ్డలి నానఁబెట్టుట
మల్లాడి బుద్ధిచెప్పితే మంకు మానీనా
(॥ఆత॥)
మేనదానవై తేను మేరతోఁ గైకొందుగాక
ఆనలువెట్టుదురా ఆతనితోను
పూని చల్లలమ్మేవారిపొందు దూలమూఁతకోల
ఆనుకెంత కిందుపడ్డా నారడి మానీనా
(॥ఆత॥)
చనవరివైవుండితే సరసమాడుదుగాక
యెనసి శ్రీ వెంకటేశునెగ్గులెంతురా
గునిసి మందలవారిగుణము రాతిపైనార
ననుపెంత గలిగినా నాలి మానీనా
(||pallavi||)
ādam̐ḍĕṁta nīvĕṁta avune melu
yedaridānavu nīgu nĕṁchanunnadā
(||āda||)
sĕllubaḍigalidenu śhiṁgāriṁchugŏṁdugāga
palladālāḍudurā padidonu
gŏllavāri toḍibani gŏḍḍali nānam̐bĕṭṭuḍa
mallāḍi buddhisĕppide maṁku mānīnā
(||āda||)
menadānavai tenu meradom̐ gaigŏṁdugāga
ānaluvĕṭṭudurā ādanidonu
pūni sallalammevāribŏṁdu dūlamūm̐tagola
ānugĕṁta kiṁdubaḍḍā nāraḍi mānīnā
(||āda||)
sanavarivaivuṁḍide sarasamāḍudugāga
yĕnasi śhrī vĕṁkaḍeśhunĕggulĕṁturā
gunisi maṁdalavāriguṇamu rādibaināra
nanubĕṁta galiginā nāli mānīnā